తెలుగు భాషా దినోత్సవం- సుమారు పదిహేను సంవత్సరాల క్రితం బడిలో జరుపుకున్న పండగ. ఈ తెలుగు వారు తెలుగు బాట కార్యక్రమం చేద్దామని అన్న నిమిషం నుండీ దీన్ని ఎలా విజయవంతం చేయాలా! అన్న ఆలోచన మొదలైంది. మా అమ్మ నేర్పిన అప్పయ్య దీక్షుతుల వారి పద్యం “ఆంధ్రత్వం ఆంధ్ర భాషా చ ఆల్పస్య తపః ఫలం” దాని అర్ధం మనసులో ఒక్క సారి జ్ఞప్తికి వచ్చాయి. జీతం కోసం పరభాషను ఆశ్రయించిన నేను మళ్ళీ జీవితం కోసం అమ్మ భాషలో బ్లాగటం మొదలుపెట్టినా ఇంకా ఏదో చేయాలన్న తపన. సరే- ఈ తెలుగు సంస్థలో సభ్యుడినైన నాకు ఆ కోరికను తీర్చుకునే అవకాశం రానే వచ్చింది.
నేను బ్లాగటం మొదలెట్టినప్పటి నుండీ తెలుగు భాషపై గౌరవం ప్రేమ రోజురోజుకూ ఎక్కువవసాగాయి. అక్షయమైన యాభై రెండు తెలుగు అక్షరాలంటే ఎందుకో తెలియదు కానీ అవ్యాజమైన ప్రేమ. పాశ్చాత్య నాగరికతను ఆఫీసుకు పరిమితం చేయక నట్టింటికి తెచ్చుకున్నాను ఇన్నాళ్ళూ- మళ్ళీ నా నాగరికత, నా భాష కోసం వెనక్కి వెళ్తుంటే నా బాల్యంలోకి వెళ్తున్నంత ఆనందం కలిగింది.
ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ఎందరో ప్రముఖులను కలిసే అవకాశం నాకు, సో
దరి సుజాత గారికి మరియు కొందరు తెలుగు మిత్రులకూ కలిగింది. మీడియా భాగస్వామ్యం కోసం హెచ్.ఎమ్.టీ.వీ అధినేత రామచంద్ర మూర్తి గారిని కలిస్తే, సంస్థ చేస్తున్న కృషిని మనఃస్పూర్తిగా అభినందించి స్క్రోలింగ్, ప్రోమోలు మరియు కవరేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పెద్దాయన కార్యక్రమంలో పాల్గొంటానని మాట కూడా ఇచ్చారు. తెలుగు బాటలో పాల్గొనే వారికి ఉచితంగా సీడీలను అందించడానికి కంప్యూటర్ విజ్ఞానం తేజ గారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారి సంస్థ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల సంచికలో ఈ తెలుగు కోసం కొన్ని పేజీలను కేటాయించి వారివంతు సహకారం అందించారు. సహృదయం స్పందిస్తే సత్కార్యం సాధ్యమే అని అందరూ నిరూపించుకున్నారు.
రాము గారు, చక్రపాణి గారు, నందం నరేష్ చేసిన సహాయం మరచిపోలేనిది. మేము అడిగిందే ఆలస్యం అన్ని ఏర్పాట్లనూ దగ్గరుండి చేసిపెట్టారు. కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో సూచనలు చేసి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించారు. తనికెళ్ళ భరణి గారి బైట్ కోసం పది నిమిషాల సమయం ఇచ్చినా కార్యక్రమ లక్ష్యం అర్ధం చేసుకుని మరెందరో ప్రముఖులకు ఫోన్లు చేసి మూడుగంటల పాటు అందరితో మాట్లాడి సంస్థనూ, కార్యక్రమాన్నీ పరిచయం చేసి వారి సహాయాన్ని కోరారు. అందులో కొందరు- గాయని శైలజ గారు, పాటల రచయితలు భువనచంద్ర, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి(తెలుగు బాట కార్యక్రమానికి పాట రాసి ఇచ్చారు), నటులు అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, బాల ఆదిత్య, దర్శకులు వి.ఎన్ ఆదిత్య, గాయకులు రఘు కుంచే, నిహాల్, రాజకీయ నాయకులు బండారు దత్తాత్రేయ మరియు చంద్రబాబు నాయుడు- కార్యక్రమ విషయం చెప్తే చాలా సంతోషించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తూ బైట్స్ ఇచ్చారు. ఇంకా చాలా మందిని కలిసే అవకాశం ఉన్నా సమయాభావం వల్ల కలవలేకపోయాము.
అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం ఆరున్నరకు తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరాం. తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి మెడలో వాడిపోయిన పూల దండ చూసేప్పటికి క
ట్టా విజయ్ గారికి మనసూరుకున్నట్టు లేదు. వెంటనే పైకి ఎక్కి దానిని తొలగించే ఏర్పాట్లలో పడ్డారు. నేనూ నావంతుగా పీఠం పైకి ఎక్కాను. తెలుగు తల్లికీ చామంతుల దండ వేసిన ఆ క్షణం ఓ గొప్ప అనుభూతి.
తెల్లవారుఝామున 8కి, పైగా ఆదివారం, ఆపై తెలుగు తల్లి విగ్రహం వద్ద కార్యక్రమం— అయినా పట్టించుకోకుండా వచ్చిన అశేష జనావళిని చూసి ముచ్చటేసింది. ఎనభై లక్షల జనాభా ఉన్న హైదరాబాదులో తెలుగు భాష కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలు పత్రికలలో, మీడియాలో, ఆన్ లైన్లో ప్రకటనలు వచ్చినా, కార్యక్రమంలో పాల్గొనడానికి సభ్యత్వ రుసుము లేదనీ ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ… అని చెప్పినా పట్టుమని వంద మంది కూడా రాకపోతే కాస్త బాధేసింది- “గంగి గోవు పాలు గరిటడైనను చాలు” అన్నట్లు వచ్చిన వారు తక్కువైనా అందరూ వారి భాషాభిమానాన్ని చాటుకున్నారు. రానివాళ్ళ సంగతా! సరే కానివ్వండి- ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కనీసం రాబోయే కార్యక్రమాలకైనా వస్తారేమో చూద్దాం!
అందరితో కలిసి బానర్లు కట్టడం, “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” పాడటం, తాడేపల్లి వారు రాసిన “తెలుగు భాష ప్రతిజ్ఞ” చేయడం ఆనందాన్ని కలిగించాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న సమయానికి వచ్చిన రామ చంద్ర మూర్తి గారు, పూణే నుండి వచ్చిన తాత గారు- “ఫణి బాబు” గారు, రాజకీయాల కన్నా తెలుగుపై ఎక్కువ మమకారం ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు, భూమిక సత్యవతి గారు, ఇంగ్లీష్& తెలుగు సుజాత గార్లూ, అమెరికా నుండీ అప్పుడే దిగుమతైన చక్రవర్తీ, ఎప్పటిలాగానే చదువు ఎగ్గొట్టి మరీ వచ్చిన కౌటిల్య, అసలు రాడు అనుకున్న అశ్విన్ బూదరాజు మరియు అనేక మంది తెలుగు మిత్రులను కలవటం సంతోషంగా అనిపించింది. 
“ప్రాచీనతనూ సాధించాం-ఆధునికతనూ సాధిస్తాం“, “జీతం కోసం పరభాష- జీవితం కోసం మన భాష“, “పొరుగు భాషను గౌరవించూ- ఇంటి భాషను కౌగిలించూ” అనే నినాదాలు తెలుగు బాట పూర్తయ్యే వరకూ సాగాయి. పేరు తెలియదు కానీ ఓ బ్లాగ్ మిత్రుడు తెలుగు బాట పూర్తయ్యేవరకూ నినాదాలు చేస్తూ అందరినీ చైతన్యపరిచాడు. స్వాతి గారు దారి పొడవునా ఆగుతూ అందరికీ మంచి నీటిని అందించారు.
ఆశ్చర్యంగా ఫణి బాబు గారు, బుద్ధప్రసాద్ గారు ఆఖరి వరకు నడవటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిం
చింది- ఎంతైనా వారూ “యూత్” కదా! తెలుగులోనే మాట్లాడతాం అని ఒకరికొకరు కంకణాలు కట్టుకుని జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించాం.
తెలుగును కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతీ గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ఎంతో శ్రమించిన ప్రతి ఈ తెలుగు కార్యకర్తలకూ, సహాయపడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను పరిరక్షించుకునే బాధ్యత అందరూ తీసుకోవాలి.



